
D Spiritual: Mar 23: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాటికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
మార్చి 30న మొదటి రోజు ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేసి, అక్కడ వసంతోత్సవ అభిషేకం, నివేదనలు నిర్వహిస్తారు. కార్యక్రమాలు పూర్తయ్యాక తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండవ రోజు మార్చి 31న శ్రీ భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. తరువాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
చివరి రోజు ఏప్రిల్ 01న శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలు సాయంత్రానికి ముగిసి, ఉత్సవమూర్తులు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనం వంటి పవిత్ర పదార్థాలతో అభిషేకం చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం కూడా ఘనంగా జరుగుతుంది.
వసంత ఋతువులో జరిగే ఈ ఉత్సవాన్ని ‘వసంతోత్సవం’ అని పిలుస్తారు. ఈ సందర్భంగా సుగంధ పుష్పాలు, వివిధ రకాల పండ్లను స్వామివారికి సమర్పించడం ప్రధాన విశేషంగా ఉంటుంది.
వసంతోత్సవాల నేపథ్యంలో, మార్చి 30 నుండి ఏప్రిల్ 01 వరకు మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది.
