
D Spiritual: Feb 3: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు తిరుమలలోని పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు ఇప్పటికే శరవేగంగా కొనసాగుతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపింది. ఈ క్రమంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున పలు కీలక సూచనలు జారీ చేసింది.
సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవలను, అలాగే ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి దర్శనమిస్తారు. ఫిబ్రవరి 28న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో తెప్పలపై తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే మార్చి 1 మరియు 2 తేదీల్లో కూడా శ్రీమలయప్పస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 11 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టికెట్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 8 గంటలు పడుతుండగా, టైం స్లాట్ సర్వదర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది.
సోమవారం రోజున మొత్తం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,728 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.77 కోట్లుగా నమోదైంది. సాలకట్ల తెప్పోత్సవాల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్న టీటీడీ అధికారులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.
