
DTelangana 04 May: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఫిట్స్ రావడంతో కాలువలో పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు.
మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన హర్షద్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, తోమాలపల్లి సమీపంలోని జూరాల కాలువ వద్ద వాహనాన్ని ఆపారు. కాలువ సమీపంలో కుటుంబ సభ్యులు వంటలు సిద్ధం చేస్తుండగా, హర్షద్ ముఖం కడుక్కోవడానికి కాలువలోకి దిగాడు.
అయితే, నీటిలోకి దిగిన మరుక్షణమే హర్షద్కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నియంత్రణ కోల్పోయి నీటిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనతో కేకలు వేయగా, వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి యువకుడిని నీటి నుంచి బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
“సమయానికి 108 సిబ్బంది రాకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. మా బిడ్డను మాకు అందించిన వారికి రుణపడి ఉంటాం,” అని హర్షద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు మరియు అధికారులు అభినందిస్తున్నారు.
