
జగిత్యాల బీజేపీ నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన తండ్రి ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కారును బహుమతిగా ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న పలువురు నాయకులను పక్కనపెట్టి శ్రావణికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఓ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే ఈ ఆరోపణలను ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. శ్రావణికి కారు ఇవ్వడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోదరి భావంతో, ఆశీర్వాదంగా మాత్రమే తన తండ్రి ఉపయోగించిన కారును ఆమెకు బహుమతిగా ఇచ్చానని తెలిపారు. శ్రావణికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ఆమెకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అర్వింద్ పేర్కొన్నారు.
జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, బీజేపీ మహిళా నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెకండ్‌హ్యాండ్ కారును బహుమతిగా ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల శ్రావణి అర్వింద్‌కు రాఖీ కట్టారు. సోదరి భావంతో రాఖీ కట్టినందుకు గుర్తుగా.. తన తండ్రి, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కార్లలో ఒకదానిని శ్రావణికి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కారు బహుమతి వ్యవహారం జగిత్యాల జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివాదానికి కారణమైంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి.. ఇటీవల బీజేపీలోకి వచ్చిన బోగా శ్రావణికి ఎంపీ అర్వింద్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంతృప్తి ఓ వర్గంలో వ్యక్తమవుతోంది.
పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వకుండా, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో శ్రావణికి కారు బహుమతిగా ఇవ్వడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ ప్రస్తుతం జగిత్యాల, నిజామాబాద్ బీజేపీ వర్గాల్లో కొనసాగుతోంది.
