
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన లబ్ధిదారుల తుది వెరిఫికేషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం 16 నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల కుటుంబాల అర్హతలను పరిశీలించనున్నాయి.
గత పదేళ్లుగా సంబంధిత నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా? దరఖాస్తులో పేర్కొన్న వివరాలు సరైనవేనా? కుటుంబ సభ్యుల సమాచారం వాస్తవమేనా? వంటి అంశాలను అధికారులు తనిఖీ చేయనున్నారు. అలాగే ఎంపికైన కుటుంబానికి సంబంధించిన ఇంటిని జియోట్యాగ్ చేసి, పూర్తి వివరాలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
ఈ వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశీలనలో అనర్హులుగా తేలిన వారి స్థానంలో అర్హులకు అవకాశం కల్పించేందుకు ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్‌ను కూడా సిద్ధం చేశారు. దీంతో తుది పరిశీలన అనంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అనంతరం లబ్ధిదారుల ఎంపిక కోసం ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు డ్రా ప్రక్రియను నిర్వహించింది.
ఈ లాటరీలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల పూర్తి వివరాలను హౌసింగ్ బోర్డు సేకరించింది. ఎంపికైన కుటుంబాల వివరాలను అధికారులు తదుపరి దశలో పరిశీలించనున్నారు.
నేటి నుంచి ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల తుది వెరిఫికేషన్
ఇందిరమ్మ టవర్స్‌కు లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల తుది పరిశీలన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ క్యూర్ పరిధిలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
ఏ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారో.. ఆ కుటుంబం గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో నివసిస్తుందా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలించనున్నారు. లబ్ధిదారుల నివాసం, కుటుంబ వివరాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు.
ఈ ప్రక్రియ కోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 480 ఇళ్లకు సంబంధించి 600 మందికిపైగా సిబ్బందిని వెరిఫికేషన్ కోసం నియమించారు. వీరిలో ప్రతి నియోజకవర్గానికి 20 మంది చొప్పున ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
అధికారులు రోజుకు కనీసం 150 కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి నివాసాన్ని నిర్ధారించనున్నారు. మొత్తం తుది పరిశీలన ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
