D Spiritual: Dec 30: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి 12:05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు అధికారికంగా తెరచుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. నిర్ణీత విధానం ప్రకారం మొదట వీఐపీలకు దర్శనం కల్పించగా, అనంతరం ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించింది.

తిరుపతి, డిసెంబర్‌ 30: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారం తెరచుకోవడంతో భక్తులలో అపారమైన ఆనందం వెల్లివిరిసింది. సోమవారం అర్ధరాత్రి 12:05 నిమిషాలకు వైకుంఠ ద్వార తలుపులు తెరచి దర్శనాలను ప్రారంభించారు. అర్చక స్వాములు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 1:20 గంటల మధ్యలో ప్రముఖుల దర్శనాలను ప్రారంభించారు.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, ఉదయం 5:30 గంటల నుంచి డిప్ (DIP) ద్వారా కేటాయించిన టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి నేరుగా తిరుమలకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మూడు రోజుల పాటు టోకెన్లు ఉన్న భక్తులు తమ టోకెన్‌లో పేర్కొన్న సమయానికే తిరుమలకు రావాలని సూచించారు.

దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావడంతో పాటు, డిప్‌లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని కూడా తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అనుకున్నదానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించామని, ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

వైకుంఠ ద్వార దర్శనాల కోసం కనివిని ఎరుగని విధంగా ఏర్పాట్లు చేశామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాలతో ఉత్తర ద్వార దర్శనాలను అందిస్తున్నామని తెలిపారు. భక్తులందరూ ఈ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కొద్దిసేపట్లో టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు.

వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైన వెంటనే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. అలాగే సినీనటుడు నారా రోహిత్ దంపతులు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డీవీవీ దానయ్య, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కూతుళ్లు సుస్మిత, శ్రీజలు స్వామివారిని దర్శించుకున్నారు.

అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, సవిత, నిమ్మల రామానాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు దర్శనం చేసుకున్నారు.

ఇక టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా, సినీ నటుడు శివాజీ తదితర ప్రముఖులు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్రమంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రముఖుల దర్శనాలను కూడా పరిమితం చేసి, సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని అన్నారు. మిగతా రోజుల్లో కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana