
D News: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు ‘ఏష నాగుల’ పాట కూడా గట్టి బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు.
అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ ఫోక్ బీట్‌కు జంగిరెడ్డి, ప్రభా బంగారిగళ్ల గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి తోడు నాని, కీర్తి సురేష్ స్పెషల్ అప్పీయరెన్స్, ఆట సందీప్ కొరియోగ్రఫీ పాటకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. విడుదలైన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ పాట.. ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఇక ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోమని నాని స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై టీమ్ పూర్తిగా దృష్టి పెట్టిందని, మంచి ట్రైలర్ కట్ చేయాలంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ సహా కీలక టీమ్ కొన్ని రోజులు ఆ పనికే కేటాయించాల్సి ఉంటుందని నాని తెలిపారు. సినిమా క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ వంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. విడుదల తర్వాత ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
