DSports Dec20 2025: ముంబై: భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. 2026లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును సెలక్టర్లు నేడు (శనివారం) ముంబైలో ప్రకటించనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో చర్చించి 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును వెల్లడించనుంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించడం ఖాయం. అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ కోల్పోయి తడబడుతున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గిల్ స్థానంలో ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్‌ను తీసుకోవాలా? లేక అతన్నే కొనసాగించాలా? అనేది సెలక్టర్లకు సవాలుగా మారింది.