
DET:FEB 09:
నాగార్జున మైలురాయి చిత్రం కింగ్ 100:
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు సిద్ధమవుతున్నారు.ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.ఈ మెగా ప్రాజెక్ట్‌లో అలనాటి అందాల నటి టబు ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని నాగార్జున స్వయంగా ధృవీకరించారు.
టబు స్వయంగా అడిగి మరీ..
సాధారణంగా పెద్ద సినిమాల్లో నటీనటులను దర్శకులు ఎంపిక చేస్తారు.కానీ కింగ్ 100 విషయంలో టబు తన ఆసక్తిని స్వయంగా వ్యక్తం చేశారట.ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ.. ఈ వందో సినిమాలో నేను కూడా భాగం కావాలని టబు తన మనసులో మాట చెప్పారు.ఆమె కోరికను గౌరవిస్తూ ఈ చిత్రంలో ఆమె కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేశాం అని తెలిపారు.
హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్:
నాగార్జున,టబు అనగానే తెలుగు ప్రేక్షకులకు నిన్నే పెళ్ళాడతా,ఆవిడా మా ఆవిడే వంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ వెండితెరపై ఎప్పుడూ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.దాదాపు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోబోతుండటం అక్కినేని అభిమానులకు కళ్ల పండుగలా మారనుంది.
కొత్త దర్శకుడితో ప్రయోగం:
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవీన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.100వ సినిమా అంటే భారీ కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథ ఉండాలని నాగార్జున భావిస్తున్నారు.టబు రాకతో ఈ సినిమాకు జాతీయ స్థాయిలో క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో ఉండగా త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
