
D News: Nov 4: కండక్టర్ ప్రవళిక మృతి ఆర్టీసీకి తీరని లోటు.. కుటుంబానికి అండగా ఉంటాం: ఎండీ నాగిరెడ్డి
మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీ & ఎండీ) వై. నాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక తుదిశ్వాస విడిచిన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడి కోలుకొని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించామని, అయితే ఈ విషాద ఘటన జరగడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి ఆర్టీసీకి తీరని లోటని పేర్కొన్నారు.
నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ ఘటనకు బాధ్యురాలైన నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రవళిక మృతి విషయం తెలిసిన వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఘటనకు కారణమైన నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ అండ
ఈ క్లిష్ట సమయంలో ప్రవళిక కుటుంబ సభ్యులకు ఆర్టీసీ యాజమాన్యం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు నాగిరెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, సంస్థ తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
