DNews: తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ భూముల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఆధీనంలోని భూములు, ఆస్తులను విక్రయించడం, తనఖా పెట్టడం ద్వారా వేల కోట్ల రూపాయలు సమీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు భూములను సైతం సమీకరించి అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆస్తుల విక్రయాలే ఆదాయానికి ప్రధాన మార్గంగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు

ఇటీవల సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ప్రభుత్వ భూముల ద్వారా ఆదాయం సమకూర్చుకునే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో వినియోగంలో లేని భూములు, ఆస్తులను గుర్తించి వాటికి రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అనంతరం వాటిలో కొంత భాగాన్ని వేలం వేసి ఆదాయం పొందాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 34 నెలల్లో ప్రభుత్వ భూముల విక్రయాలు, తనఖాల ద్వారా రూ.30 వేల కోట్లకుపైగా సమీకరించినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది.

హెచ్ఎండీఏ, టీజీఐఐసీ భూములపై కన్ను

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఆధీనంలో సుమారు 5,000 ఎకరాల భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో విక్రయానికి అనువైన భూములను గుర్తించి అభివృద్ధి చేసిన తర్వాత వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) పరిధిలో లక్ష ఎకరాలకు పైగా భూముల వినియోగాన్ని సమీక్షించాలని యోచిస్తోంది. వినియోగంలో లేని పారిశ్రామిక భూములను గుర్తించి వేలం లేదా ఇతర నగదీకరణ మార్గాల ద్వారా ఆదాయం పొందే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు భూముల సమీకరణలో రైతులకు న్యాయం జరుగుతుందా?

ప్రభుత్వం ప్రైవేటు భూములను సైతం సమీకరించి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే భూములు ఇచ్చే రైతులకు కేవలం పరిహారం మాత్రమే చెల్లిస్తారా? అభివృద్ధి తర్వాత పెరిగే విలువలో వాటా కల్పిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అభివృద్ధి పేరుతో భూములు సమీకరించే సమయంలో రైతుల ప్రయోజనాలను కాపాడేలా స్పష్టమైన విధానం ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు!

ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించాలి. ఇప్పటివరకు ఎన్ని భూములు విక్రయించారు? ఎంత ఆదాయం వచ్చింది? ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారు? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ భూములను విక్రయించే ముందు పార్కులు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రజా రవాణా వంటి భవిష్యత్తు అవసరాలకు ఎంత భూమి అవసరమో నిర్ణయించాలి. తాత్కాలిక ఆదాయం కోసం విలువైన ప్రజా ఆస్తులను కోల్పోకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *