
DNews: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఉండగా, ఇప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న మూడు రోజులు మరింత చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
15 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు
రెండు రోజుల్లోనే రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 14 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 14.6 డిగ్రీలు రికార్డైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట తదితర జిల్లాల్లోనూ చలి ప్రభావం పెరిగింది.
11 డిగ్రీలకు పడిపోయే అవకాశం
రానున్న మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 12 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
మరోవైపు ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. 24 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని అంచనా వేసింది. ఆసిఫాబాద్, నిర్మల్, వరంగల్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది.
చిన్నపిల్లలు, వృద్ధులు చలిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
