తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సెక్షన్ 22A నిషేధిత భూముల అంశంపై కీలకంగా ప్రసంగించారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ వరకు రాష్ట్రంలోని భూముల వర్గీకరణకు సంబంధించిన చారిత్రక పరిణామాలను ఆయన వివరించారు.
రాష్ట్ర భూ రికార్డుల్లో నమోదైన మొత్తం 2.5 కోట్ల ఎకరాల్లో సుమారు 1.01 కోట్ల ఎకరాలు శాశ్వతంగా నిషేధిత ప్రభుత్వ, ప్రజా భూముల కేటగిరీల్లో ఉన్నాయని సీఎం తెలిపారు. ఇందులో సుమారు 46 లక్షల ఎకరాల అటవీ భూములు, 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 17 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, 12 లక్షల ఎకరాల జలవనరులు, శిఖం భూములు ఉన్నాయని వివరించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని ధరణి పోర్టల్‌లో ఒక సర్వే నంబర్‌లోని చిన్న భాగం వివాదంలో ఉన్నప్పటికీ, మొత్తం సర్వే నంబర్‌ను సెక్షన్ 22A కింద ఆటోమేటిక్‌గా లాక్ చేసే పరిస్థితి ఏర్పడిందని సీఎం ఆరోపించారు.
ప్రైవేటు భూముల యజమానులకు భరోసా కల్పిస్తూ, వాస్తవంగా వివాదంలో ఉన్న ప్రైవేటు భూమి సుమారు 3.05 నుంచి 3.06 లక్షల ఎకరాల వరకు మాత్రమే ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రికార్డులను పూర్తిగా పరిశీలించి, తప్పుగా 22A కింద చేర్చిన భూములను డీనోటిఫై చేసే చర్యలు చేపడతామని చెప్పారు. నిజమైన భూ యజమానులు ఒక్క అంగుళం భూమిని కూడా కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.
