
DSports:09 OCT:న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా, టీమ్‌ఇండియా అక్టోబర్ 15న రెండు విడతలుగా బయలుదేరనుంది. బిజినెస్ క్లాస్ టికెట్ల అందుబాటును దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణించనున్నారు.
ఈ నెల 10 నుంచి 14 వరకు భారత్–వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ జరుగనుంది. టెస్టు ముగిసిన వెంటనే వన్డే జట్టులోని ప్లేయర్లు ఆస్ట్రేలియా పయనమవుతారు. ఆసీస్ పర్యటనకు ఎంపికైన రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు క్రికెటర్లు తొలి వన్డేకు వేదికైన పెర్త్ చేరుకోనున్నారు.
2027 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేలు ముగిసిన వెంటనే రెండు జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడనున్నాయి.
టీమ్‌ఇండియాకు గంభీర్ ఆతిథ్యం
టీమ్‌ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్ బుధవారం ఢిల్లీలోని రాజిందర్‌నగర్‌లో తన నివాసంలో ప్లేయర్లకు డిన్నర్ ఏర్పాటు చేశాడు. విండీస్‌తో రెండో టెస్టు ప్రారంభం కంటే ముందు ఆటగాళ్లు అందరూ కలసి గంభీర్ ఇంట్లో సందడి చేశారు. ఆసీస్ పర్యటనకు ముందు జట్టులో ఐక్యత, ఉత్సాహం నింపే కార్యక్రమంగా ఇది నిలిచింది.
