
SDports 22Jan 2026:వైక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక ‘టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2026’లో ఐదో రౌండ్ భారత్‌కు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ ఈ టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేయగా, టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన అర్జున్ ఇరిగైసి అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.
- వరుసగా నాలుగు డ్రాల తర్వాత, ఐదో రౌండ్‌లో గుకేశ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. చెక్ రిపబ్లిక్ గ్రాండ్‌మాస్టర్ థాయ్ డై వాన్ న్గుయెన్‌తో జరిగిన పోరులో నల్లటి పావులతో ఆడిన గుకేశ్.. అద్భుతమైన ఎక్స్ఛేంజ్ శాక్రిఫైస్ (Exchange Sacrifice) ద్వారా ప్రత్యర్థిని కట్టడి చేశాడు. 46 చదరంగ ఎత్తుల తర్వాత న్గుయెన్ ఓటమిని అంగీకరించడంతో గుకేశ్ ఈ టోర్నీలో మొదటి పూర్తి పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
- మరోవైపు, అద్భుత ఫామ్‌లో ఉన్న అర్జున్ ఇరిగైసికి ఐదో రౌండ్ కలిసిరాలేదు. స్లోవేనియాకు చెందిన వ్లాదిమిర్ ఫెడోసీవ్ చేతిలో అర్జున్ ఓటమి చెందాడు. రిస్కీ ఓపెనింగ్‌తో వెళ్లిన అర్జున్‌కు, ఫెడోసీవ్ తన వ్యూహాలతో చెక్ పెట్టాడు. అలాగే, భారత్‌కే చెందిన మరో ఆటగాడు అరవింద్ చిదంబరం కూడా జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
- డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్. ప్రజ్ఞానంద స్థానిక స్టార్ అనీష్ గిరితో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.
