D News: Aug 11: తమిళనాడు శాసనసభ వేదికగా భాషాభిమానం, సాంస్కృతిక ఆత్మగౌరవానికి సంబంధించిన కీలక తీర్మానం ఆమోదమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వహించే బహిరంగ కార్యక్రమాల్లో ఇకపై రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను మొదట ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార టీవీకేతో పాటు డీఎంకే, అన్నాడీఎంకే సహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి.

తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ తమిళం కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది తమ జీవన విధానం, భావోద్వేగం, ఐక్యతకు ప్రతిరూపమని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో రాష్ట్ర గీతానికి మొదటి స్థానం కల్పించడం తమ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి తమిళ భాష గౌరవం కోసం అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే, ఇతర కూటమి పక్షాలు తీర్మానానికి మద్దతు ప్రకటించాయి.

శాసనసభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని స్పీకర్ తెలిపారు. దీని అమలుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ‘తమిళ్ తాయ్ వాళ్తు’కు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.

‘తమిళ్ తాయ్ వాళ్తు’ గీతాన్ని ప్రముఖ తమిళ పండితుడు ప్రొఫెసర్ పి. సుందరం పిళ్లై 1891లో రచించిన ‘మనోన్మణియం’ నాటకంలోని ‘నీరారుమ్ కడలుడుత్త’ పద్యాల నుంచి స్వీకరించారు. 1970లో అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో ఈ గీతాన్ని ఆలపించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం 2021లో తమిళనాడు ప్రభుత్వం దీనిని అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించి, గీతం ఆలపించే సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడటాన్ని తప్పనిసరి చేసింది.

ఇటీవల తమిళనాడులోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ కార్యక్రమంలో గవర్నర్ సమక్షంలో ‘వందేమాతరం’, జాతీయ గీతం తర్వాత ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో తమ రాష్ట్ర గీతానికే మొదటి ప్రాధాన్యం ఉండేలా స్పష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను అన్ని అధికారిక కార్యక్రమాల్లో ముందుగా ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ శాసనసభలో తీర్మానం ఆమోదించినట్లు సమాచారం.