
D Spiritual: Nov 9: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సోమవారం ఆలయ ప్రధాన అర్చక బృందం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, మరోవైపు వేలాది మంది భక్తులు సామూహికంగా గిరిప్రదక్షిణ చేశారు. నరసింహ నామస్మరణతో యాదగిరిగుట్ట క్షేత్రం మార్మోగింది.
వేకువజామున స్వాతి నక్షత్ర వేడుకలు..
స్వామివారి సన్నిధిలో వేకువజామున ప్రధాన అర్చకుడు భట్టర్ సురేంద్రాచార్యుల బృందం అష్టోత్తరశతఘటాభిషేకం నిర్వహించింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా గర్భాలయ ముఖ మండపంలో 108 కలశాలను ఏర్పాటు చేసి, వాటిపై కొబ్బరికాయలు పేర్చి నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం పవిత్ర నదీ జలాలు, పంచామృతాలతో కలశాలను నింపి పంచసూక్త పఠనాలతో హోమం నిర్వహించారు.
వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అష్టోత్తరశతఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని 108 సువర్ణ పుష్పాలతో ప్రత్యేకంగా అర్చించారు.
వైభవంగా సామూహిక గిరిప్రదక్షిణ..
కొండకింద ఉన్న వైకుంఠద్వారం వద్ద స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున 5.30 గంటలకు సామూహిక గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవస్థానం ఈవో జే. భవానీశంకర్ స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ సమర్పించి హారతి ఇచ్చిన అనంతరం గిరిప్రదక్షిణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్, ఈవోతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు కొండ చుట్టూ సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ చేశారు. దాదాపు 45 నిమిషాల్లో ప్రదక్షిణ పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్షేత్రం పడమర దిక్కున స్వామివారి దర్శనం కోసం సుమారు 1,500 ఉచిత దర్శనం టికెట్లు అందజేశారు. రూ.150 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయంలోకి అనుమతించారు.
25 వేల మందితో గిరిప్రదక్షిణ..
స్వాతి నక్షత్ర వేడుకల సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం స్వామివారి ఆరగింపు సమయం వరకు సుమారు 25 వేల మంది భక్తులు గిరిప్రదక్షిణ చేసినట్లు సమాచారం. అనంతరం భక్తులు స్వయంభువులైన లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణ ముగించుకుని వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వైకుంఠద్వారం వద్ద భారీగా రద్దీ నెలకొంది.
భక్తుల రద్దీ.. పోలీసుల బందోబస్తు
స్వాతి నక్షత్ర వేడుకలు, గిరిప్రదక్షిణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్టలోని ప్రధాన రహదారులు, ఆలయ పరిసరాల్లో రద్దీ ఏర్పడింది. గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులు తమ వాహనాలను రహదారికి మూడు వైపులా నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
యాదగిరిగుట్ట డీఎస్పీ బాలయ్య, శ్రీనివాస్ నాయుడు పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బొడ్డుపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
