
D News : సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్‌కు దూరంగా ఉండాలని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులకు సూచించారు. ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వెంటనే స్పందించకుండా.. అనవసరమైన వివాదాల్లో సమయం, శక్తిని వృథా చేసుకోవద్దని హితవు పలికారు.
ప్రేమను మాత్రమే పంచండి
ఇటీవల చెన్నైలో జరిగిన ఆల్ ఇండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ సమావేశంలో అభిమానులతో మాట్లాడిన సూర్య.. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ పోస్టులకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎదుటివారి అభిప్రాయాలను మార్చడం అంత సులభం కాదని, అందుకే విమర్శలకు సమాధానాలు ఇస్తూ సమయాన్ని వృథా చేయకుండా తమ పనిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇటీవల శివకార్తికేయన్ ‘సర్దార్ 2’, ‘మండాడి’ చిత్రాలకు సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన తర్వాత కొందరు అభిమానుల మధ్య చర్చ, ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే సూర్య వ్యాఖ్యలు రావడంతో.. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పారనే చర్చ జరుగుతోంది. అయితే సూర్య మాత్రం తన ప్రసంగంలో ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు.
ప్రస్తుతం ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయాలతో సూర్య మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం ‘సీన్’కు జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది.
