
D NEWS: యువ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈ రంగాలను ప్రోత్సహించడం అవసరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ హైదరాబాద్ 2026’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ యువత ఉద్యోగాలు వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.
వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఎంఎస్‌ఎంఈ రంగం ఉపాధి కల్పిస్తోందని కేటీఆర్ గుర్తుచేశారు. కొత్త సాంకేతికత, వినూత్న ఆలోచనలతో యువ పారిశ్రామికవేత్తలు మార్కెట్‌లోకి రావాలని సూచించారు.
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినీ నటుడు నాగచైతన్య, మాజీ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌తో కలిసి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులకు అవార్డులు అందించారు.
నాగచైతన్య మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. లాభాలతో పాటు సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.
పరిశ్రమలు, ఐటీ, వైద్యం, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవలు, సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ చూపిన వారిని కార్యక్రమంలో సత్కరించారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడమే అవార్డుల కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
