
DSports 14 Nov:ఢాకా వేదికగా జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2025లో భారత కాంపౌండ్ ఆర్చర్లు సత్తా చాటారు. ముఖ్యంగా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అసాధారణ ప్రదర్శనతో ఏకంగా రెండు స్వర్ణ పతకాలు (డబుల్ ధమాకా) సాధించి భారత్‌కు ట్రిపుల్ గోల్డ్ అందించడంలో కీలకపాత్ర పోషించింది.
ట్రిపుల్ గోల్డ్ వివరాలు:
మహిళల టీమ్ గోల్డ్: జ్యోతి సురేఖ, దీప్షిక, ప్రతీక ప్రదీప్‌లతో కూడిన భారత త్రయం మహిళల టీమ్ ఫైనల్లో కొరియా జట్టుపై 236-234 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
వ్యక్తిగత గోల్డ్: మహిళల వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ ఫైనల్లో తన సహచర ఆర్చర్ ప్రతీక ప్రదీప్‌పై 147-145 తేడాతో గెలిచి రెండో స్వర్ణాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన తొలి ఆర్చర్‌గా సురేఖ రికార్డు నెలకొల్పింది.
మిక్స్డ్ టీమ్ గోల్డ్: దీప్షిక-అభిషేక్ వర్మ జోడీ కూడా స్వర్ణ పోరులో బంగ్లాదేశ్ జంటపై 153-151తో గెలిచి భారత్‌కు మూడో బంగారు పతకాన్ని అందించింది.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత కాంపౌండ్ ఆర్చర్లు మొత్తం మూడు స్వర్ణాలు, రెండు రజతాలతో అగ్రస్థానంలో నిలిచి దేశ కీర్తిని ఇనుమడింపజేశారు
