
DET:NOV 20:
రజినీకాంత్ టైమ్స్ గా ముఖచిత్రం గౌరవం:
భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయనకు ఒక అరుదైన గొప్ప గౌరవం దక్కింది.హిందుస్థాన్ టైమ్స్ మరియు OTTplay సంస్థలు సంయుక్తంగా తమ వార్తాపత్రిక ముఖచిత్రాన్ని తొలిసారిగా మార్చి,ఆ లెజెండ్‌కు అంకితమిస్తూ రజినీకాంత్ టైమ్స్ గా ప్రచురించాయి.సినిమాలకు అతీతంగా ఒక వ్యక్తి ప్రభావాన్ని ఆయన సాంస్కృతిక చరిత్రను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించడం రజినీకాంత్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.ఈ ప్రత్యేక సంచికలో ఆయనను ఆరాధించే ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు దర్శకులు ఆయన ప్రస్థానం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
బస్ కండక్టర్ నుండి కల్చరల్ ఐకాన్ వరకు:
శివాజీరావు గైక్వాడ్‌గా బెంగుళూరులో ఒక బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజినీకాంత్ 1975లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.మొదట్లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ తన అద్భుతమైన నటన ప్రత్యేకమైన స్టైల్ ద్వారా అతి కొద్ది కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు.బాషా,ముత్తు,శివాజీ,రోబో వంటి చిత్రాలతో ఆయన కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా భారతీయ సినీ ప్రపంచంలోనే ఒక కల్చరల్ ఐకాన్‌గా మారారు.
తగ్గని స్టార్డమ్ తరగని స్ఫూర్తి:
ఐదు దశాబ్దాలు గడిచినా 70 ఏళ్లు పైబడిన వయసులోనూ రజినీకాంత్ స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు.ఆయన కృషి, నిరాడంబరత,పట్టుదల నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.ఆయన తాజా చిత్రం కూలీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించడం ప్రేక్షకులు సినిమా విడుదలను పండుగలా జరుపుకోవడం ఆయనకున్న అసాధారణమైన ప్రజాదరణకు నిదర్శనం.పద్మభూషణ్,పద్మ విభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న ఆయన ప్రయాణం – అంకితభావం,నిలకడ,వినయానికి నిలువెత్తు నిదర్శనం.
ప్రభుత్వ గౌరవం:
రజినీకాంత్ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI లోనూ ఆయనను నందమూరి బాలకృష్ణను ఘనంగా సన్మానించనున్నారు.భారతీయ సినిమాకు వారు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక గౌరవం లభించింది.
