SS Rajamouli Says Eega Gave Him More Satisfaction Than Baahubali

D News : దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన సినీ ప్రయాణం గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన సినిమాపై మనసులోని మాటను బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపు తీసుకొచ్చిన ‘బాహుబలి’ కంటే, అంతకుముందు తెరకెక్కించిన ‘ఈగ’ సినిమానే దర్శకుడిగా తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందని వెల్లడించారు.

‘ఈగ’ నా జీవితంలోనే పెద్ద ప్రయోగం

రాజమౌళి మాట్లాడుతూ.. తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద ప్రయోగం ‘ఈగ’ అని పేర్కొన్నారు. ఆ సినిమా తనకు అందించిన సంతృప్తిని మాటల్లో చెప్పలేనని తెలిపారు. భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా ‘ఈగ’ తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని చెప్పారు.

సాధారణంగా ప్రేక్షకులు తన ప్రయాణాన్ని ‘బాహుబలి’కి ముందు, తర్వాత అని చూస్తారని.. కానీ దర్శకుడిగా తనలో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచిన సినిమా మాత్రం ‘ఈగ’ అని రాజమౌళి వివరించారు. తన దృష్టిలో ‘ఈగ’కు ముందు, ‘ఈగ’కు తర్వాత అన్నట్లుగా కెరీర్‌ను భావిస్తానని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని రూపొందిస్తున్న రాజమౌళి వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. భారీ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు.. తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమాగా ‘ఈగ’ను ప్రస్తావించడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

By Avinash