Naresh Challenges Audiences: “If You Don't Like Crazy Kalyanam, Meet Me in Gachibowli!”

D News : సినిమా బాగోలేదని ప్రేక్షకులు విమర్శిస్తే సాధారణంగా చిత్రబృందం వివరణ ఇస్తుంది. కానీ తన సినిమా నచ్చకపోతే నేరుగా వచ్చి ప్రశ్నించాలంటూ సీనియర్ నటుడు నరేష్ బహిరంగంగా సవాల్ విసిరారు. ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 16న దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని నరేష్ స్పష్టం చేశారు.

“సినిమా నచ్చకపోతే గచ్చిబౌలిలోని విజయకృష్ణ టవర్స్‌కు రండి. నేనక్కడే ఉంటాను. మా టీమ్ కూడా అక్కడే ఉంటుంది. సినిమా ఎందుకు నచ్చలేదో వచ్చి చెప్పండి.. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సినిమా విషయంలో తాను జోక్ చేయడం లేదని, ప్రేక్షకుల అభిప్రాయాలను నేరుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

300 సినిమాల్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్!

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 300కు పైగా సినిమాల్లో నటించిన నరేష్.. ‘క్రేజీ కల్యాణం’లోని తన పాత్ర చాలా ప్రత్యేకమని తెలిపారు. ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇదే తనకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర అని పేర్కొన్నారు. ఇందులో ప్రతి నటుడు తన పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చారని చెప్పారు.

రక్తపాతం, ఆత్మహత్యలు, అనవసరమైన హంగులు లేకుండా సహజమైన కథనం, నిజాయతీతో కూడిన వినోదాన్ని అందించే చిత్రంగా ‘క్రేజీ కల్యాణం’ ఉంటుందని నరేష్ వివరించారు. ప్రేక్షకులను మెప్పించే కథ, పాత్రలే ఈ సినిమాకు ప్రధాన బలమని ఆయన అభిప్రాయపడ్డారు.

టికెట్ ధరలపై నరేష్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుత రోజుల్లో సినిమా చూడటం ప్రేక్షకులకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని నరేష్ అన్నారు. థియేటర్‌కు వెళ్లడానికి ప్రయాణ సమయం, సినిమా చూసేందుకు వెచ్చించే సమయం, టికెట్ ధరలు, ఇతర ఖర్చులను ప్రేక్షకులు పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు.

అందుకే ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సినిమాలో నిజాయతీతో కూడిన కంటెంట్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల సమయానికి, డబ్బుకు విలువ ఇచ్చే సినిమాగా ‘క్రేజీ కల్యాణం’ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై నరేష్‌కు ఉన్న నమ్మకం ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. సినిమా నచ్చకపోతే నేరుగా వచ్చి మాట్లాడాలంటూ ఆయన చేసిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

By Avinash