South Movies: Exciting South Films Hitting Theatres This Week

D News: ఈ వారం సౌత్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు పలు విభిన్నమైన సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామా, హారర్ మిస్టరీ, స్పై యాక్షన్, సైన్స్‌ఫిక్షన్ ఇలా వేర్వేరు జానర్లలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విడుదల కానున్న ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి.

దాయ్‌రా (Daayra)

మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘దాయ్‌రా’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ అధికారులుగా కనిపించనున్న ఈ సినిమా నేరం, శిక్ష, న్యాయం చుట్టూ సాగే కథతో రూపొందింది. ఇద్దరు పోలీస్ అధికారుల మధ్య జరిగే ఇన్వెస్టిగేషన్, వారి ఎదురయ్యే సవాళ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఎన్న విలై (Enna Vilai)

జాతీయ అవార్డు గ్రహీత సజీవ్ పజూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎన్న విలై’ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రామేశ్వరం సముద్ర తీరంలో భక్తులు విసిరే నాణేలను ఏరుకుంటూ జీవించే ఓ సాధారణ వ్యక్తి జీవితంలోకి ఊహించని సమస్య రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓ లాకెట్ చుట్టూ మొదలయ్యే వివాదం, తప్పుడు ఆరోపణలు, అవినీతి వ్యవస్థపై న్యాయపోరాటం వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. కరుణాస్, నిమిషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు.

ది డార్క్ హెవెన్ (The Dark Heaven)

హారర్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అంశాలతో రూపొందిన ‘ది డార్క్ హెవెన్’ సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమైంది. ఓ మారుమూల కొండ ప్రాంత గ్రామంలో ప్రతి ఏడేళ్లకోసారి జూన్ నెలలో పురుషులు అనుమానాస్పదంగా మృతి చెందుతుంటారు. దీని వెనుక దుష్టశక్తి ఉందని గ్రామస్థులు నమ్ముతుంటారు. అసలు కారణాన్ని తెలుసుకునేందుకు గ్రామానికి వచ్చిన కొత్త ఇన్‌స్పెక్టర్ ఎలాంటి నిజాలను బయటపెడతాడనేదే సినిమా కథ.

సీక్రెట్ సోల్జర్ (Secret Soldier)

అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సీక్రెట్ సోల్జర్’ కూడా సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వస్తోంది. ఓ సాధారణ కాలేజీ విద్యార్థి అనుకోకుండా నకిలీ కరెన్సీ, అంతర్జాతీయ హ్యాకింగ్ కుట్రలో చిక్కుకోవడంతో కథ మొదలవుతుంది. దేశభక్తి, నమ్మకద్రోహం, యాక్షన్ అంశాలతో సాగే ఈ సినిమాలో నిహాల్ కోదటి, సూర్య శ్రీనివాస్, కమల్ కామరాజు, రఘుబాబు తదితరులు నటించారు.

ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (It’s a Medical Miracle)

తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ కూడా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ఓ ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్లిన యువకుడు తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత అతనిలో ఊహించని మార్పు చోటుచేసుకుంటుంది. అత్యంత సూక్ష్మమైన శబ్దాలను కూడా వినగలిగే శక్తి అతనికి రావడంతో.. కోమాలో ఉన్న సమయంలో తనతో మాట్లాడిన ఓ నర్స్ కోసం అతను వెతకడం మొదలుపెడతాడు. ఆ అన్వేషణలో బయటపడే రహస్యాలే కథలో కీలకంగా ఉండనున్నాయి.

వీటితో పాటు ‘టాస్’, ‘హ్యాపీ జర్నీ’, ‘లా అండ్ ఆర్డర్’ వంటి సినిమాలు కూడా ఈ వారంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. స్నేహం, రోడ్ ట్రిప్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో ‘టాస్’, ‘హ్యాపీ జర్నీ’ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుండగా.. క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో ‘లా అండ్ ఆర్డర్’ తెరకెక్కింది. మొత్తంగా ఈ వారం సౌత్ బాక్సాఫీస్ వద్ద విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

By Avinash