
DSports 1 Dec:ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ వివాహం వాయిదా పడటంపై నెలకొన్న గందరగోళం, ఊహాగానాల మధ్య పలాష్ ముచ్ఛల్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.
పెళ్లి వాయిదా తర్వాత తొలి బహిరంగ ప్రదర్శన
పెళ్లి వాయిదా పడిన తర్వాత, అలాగే ఒత్తిడి కారణంగా స్వయంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత, పలాష్ ముచ్ఛల్ డిసెంబర్ 1, 2025న తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై విమానాశ్రయంలో మొదటిసారిగా మీడియాకు కనిపించారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పెళ్లి వాయిదా గురించి ప్రశ్నించగా, పలాష్ ముచ్ఛల్ నేరుగా స్పందించడానికి నిరాకరించారు. అయితే, కెమెరాలకు చూస్తూ తల వంచుతూ, ప్రశాంతంగా ఉన్నట్లు సంకేతమిచ్చారు. ఈ ఘటన పెళ్లి రద్దు అయిందంటూ వస్తున్న పుకార్లకు కొంతవరకు తెర దించింది. మొదట స్మృతి తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత, ఈ ఒత్తిడితో పలాష్ కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకుంటున్నారు.
పుకార్లకు చెక్ పెట్టిన కుటుంబ సభ్యులు, జంట
వివాహం వాయిదా పడగానే, స్మృతి మంధాన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లి సంబంధిత పోస్టులను తొలగించడం, పలాష్ వేరొక మహిళతో స్మృతిని మోసం చేస్తున్నాడనే పుకార్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం అయ్యాయి. ఈ ఊహాగానాలపై పలాష్ తల్లి అమిత ముచ్ఛల్ గతంలో స్పందిస్తూ, “స్మృతి, పలాష్ ఇద్దరూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అంతా బాగానే ఉంది, పెళ్లి త్వరలోనే జరుగుతుంది” అని స్పష్టం చేశారు. అలాగే, స్మృతి తండ్రి కోలుకునే వరకు పెళ్లిని వాయిదా వేయాలని పలాషే ముందుగా నిర్ణయించుకున్నాడని ఆమె తెలిపారు. పుకార్లకు చెక్ పెడుతూ, ఇటీవల స్మృతి, పలాష్ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ బయోలలో ‘ఈవిల్ ఐ’ (చెడు దృష్టి) ఎమోజీని చేర్చి, తమపై ఎవరి ‘నజర్’ పడకుండా ఉండాలని కోరుకున్నారు.
ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించిన కొత్త తేదీని ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
