
సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం తారా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను, అంబేద్కర్ స్టేడియంలో సభా ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు.
అనంతరం సభా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు మాత్రమే పంపిణీ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి 5 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో భాగంగా కమిట్మెంట్తో పనిచేస్తోందన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలో సుమారు 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.
