Sivakarthikeyan: Fans Meet Sparks Fresh Buzz Over His Political Entry!

D News :తమిళ సినీ పరిశ్రమలో హీరోల రాజకీయ అడుగులపై చర్చ కొనసాగుతున్న వేళ.. మరో స్టార్ హీరో శివకార్తికేయన్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే శివకార్తికేయన్ నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించకపోయినా.. ఆయన మాటలు మాత్రం కొత్త చర్చకు దారితీశాయి.

‘నా ఎదుగుదల ఫ్యాన్స్ వల్లే’

ఆదివారం చెన్నైలోని పోరూర్‌లో శివకార్తికేయన్ అభిమానుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన శివకార్తికేయన్.. తనను ప్రజలే స్టార్‌గా నిలబెట్టారని అన్నారు.

తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా లక్ష్యంపై స్పష్టత ఉండాలని సూచించారు. విమర్శలు చేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారని, వాటిని పట్టించుకోకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

విద్యార్థులకు ప్రత్యేక సూచనలు

సమావేశానికి వచ్చిన విద్యార్థులతోనూ శివకార్తికేయన్ మాట్లాడారు. చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు. కుటుంబాన్ని ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంచాలని చెప్పారు.

ఎక్కువగా చదివితే ఆలోచనా విధానం మరింత మెరుగవుతుందని, తద్వారా సోషల్ మీడియా ప్రభావానికి కూడా దూరంగా ఉండొచ్చని విద్యార్థులకు సూచించారు.

రాజకీయాలపై ఆసక్తి పెంచుతున్న ఫ్యాన్ మీట్స్

తమిళనాడులో సినీ హీరోల అభిమానుల సమావేశాలు ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు తమ ఫ్యాన్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై మాట్లాడుతున్నారు.

ఇటీవల ధనుష్, విశాల్ కూడా అభిమానులతో సమావేశమై ప్రజాసేవకు సంబంధించిన విషయాలపై స్పందించారు. మరోవైపు కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ సైతం రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ తన అభిమానులతో సమావేశం కావడం, ప్రజలే తనను స్టార్‌గా చేశారని చెప్పడం ఆసక్తిని పెంచింది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ప్రస్తుతం ఆయన అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను రాజకీయ ఎంట్రీకి సంకేతంగా చూడాలా? అనే చర్చ మాత్రమే కొనసాగుతోంది.

By Avinash