
D News: Nov 3: మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు!
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించాలనే లక్ష్యంతో ‘మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’ (WEEC)ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
మహిళా వ్యాపారాలకు పెద్దపీట!
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వారి వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. సచివాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మంత్రి సీతక్క ఈ వివరాలను వెల్లడించారు. మహిళలు కేవలం చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా స్టార్టప్‌లు, భారీ పరిశ్రమలు, ఇతర వ్యాపార రంగాల్లోనూ రాణించేలా ప్రోత్సహించడమే ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
గ్లోబల్ సమిట్‌లో ప్రత్యేక శ్వేతపత్రం విడుదల!
డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’ జరగనుంది. ఈ సదస్సు వేదికగా మహిళా పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రత్యేక శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
మహిళా పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను ఈ శ్వేతపత్రంలో వివరించనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, విధానపరమైన సహకారానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో పొందుపరచనున్నారు. ఈ సమావేశంలో కౌన్సిల్ కన్వీనర్ పల్లచోళ్ల సీతతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
నవీన్ మిత్తల్ బాధ్యతల స్వీకరణ
ఇదిలా ఉండగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నవీన్ మిత్తల్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయా శాఖల పరిపాలనా బాధ్యతలను ఆయన చేపట్టారు.
