
DSports 24 Nov: దక్షిణాఫ్రికా క్రికెటర్ సెనురన్ ముత్తుసామి… అవును, ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరు. పడిలేచిన కెరటంలా కమ్ బ్యాక్ చేసి, తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీని భారత్‌పైనే సాధించి వార్తల్లో నిలిచాడు. గువాహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో ముత్తుసామి కీలక పాత్ర పోషించాడు.
భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ముత్తుసామి, ఏడో నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగి 206 బంతుల్లో 109 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సఫారీ జట్టును, వైస్ కెప్టెన్ కైల్ వెర్రెయినె (45), ఆ తర్వాత మార్కో జాన్సెన్ (93) తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి గట్టెక్కించాడు.ముత్తుసామి-జాన్సెన్ జోడీ తొమ్మిదో వికెట్‌కు 97 పరుగులు జోడించి టీమిండియా గెలుపు ఆశలను చిదిమేశాయి.ఆఖరికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.
