
DNews:Jan 10: హైదరాబాద్: తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు కథనాలను వెంటనే అన్ని వేదికల నుండి తొలగించాలని, లేకపోతే సంబంధిత మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సంఘం నిర్బంధ క్షమాపణ కోరుతూ, తప్పుడు ప్రచారం వల్ల ఐఏఎస్ అధికారుల గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఒక మీడియా సంస్థ మంత్రి–ఐఏఎస్ అధికారి మధ్య ప్రేమాయణం ఉందని కథనం ప్రసారం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. మంత్రి ప్రత్యేకంగా ఆ మహిళా అధికారికి పదవులు కేటాయించాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి నిరాధారమైన, అనైతిక జర్నలిజం సమాజానికి, సివిల్ సర్వీసు అధికారుల ప్రతిష్టకు చెడు పేరు తెస్తుందని పేర్కొంది. సంఘం స్పష్టంగా హెచ్చరిస్తూ, తప్పుడు కథనాలను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
