
D Spiritual: Mar 14: తెలుగువారి నూతన సంవత్సరం అయిన ఉగాది 2026 మార్చి 19న ప్రారంభం కానుంది. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పండుగను శుభ్రతతో, భక్తిశ్రద్ధలతో ప్రారంభించాలి. ఇంటి గడపలకు పసుపు, కుంకుమ రాసి, మామిడి ఆకులతో తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ రోజున కులదైవంతో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మరియు శివుడిని భక్తితో పూజించాలి. ఉగాది పచ్చడిని తయారు చేసి తినడం ప్రత్యేకమైన ఆచారం. అలాగే నీటి కుండను దానంగా ఇవ్వడం కూడా శుభకరమని పండితులు చెబుతున్నారు.
ఉగాది రోజున కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం, మాంసాహారం తీసుకోవడం, మద్యం సేవించడం, పొగతాగడం వంటి పనులు చేయకూడదని చెబుతున్నారు.
అదే విధంగా దక్షిణ దిశగా కూర్చొని పంచాంగ శ్రవణం వినడం, గొడవపడటం, చిరిగిన దుస్తులు ధరించడం, ఎవరినైనా అవమానించడం వంటి పనులను కూడా నివారించాలి. ఈ నియమాలను పాటించకపోతే ఏడాది మొత్తం అశుభంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
