తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుగుతుందని ప్రజలు భావించారని, అయితే అలా ఎందుకు జరగలేదో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గుడులు, బడులు, దేవస్థానాలకు చెందిన భూములు, ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండేందుకు 22ఏ నిబంధనను తీసుకొచ్చారని రఘునందన్ రావు పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 22ఏ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరైన సమాచారంతో అసెంబ్లీకి రాలేదని విమర్శించారు.

22ఏ భూముల గురించి ఎవరైనా మాట్లాడితే వారందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని సింఫనీ హోంలో రిజిస్ట్రేషన్ల సమస్య తలెత్తడంతోనే తాను ఈ అంశంపై మాట్లాడానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా 22ఏ అంశంపై మాట్లాడుతున్నారనే కారణంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాల భూమిని తొలగించామని మంత్రి పొంగులేటి చెబుతున్నారని, ఆ భూములు ఎక్కడ, ఏ గ్రామంలో ఉన్నాయో వివరాలు వెల్లడించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 22ఏ జాబితాలో భూములను చేర్చారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, మరి వాటిని చేర్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

By Rajini