
DNews: Nov 18: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న జరిగిన “వారణాసి” సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఈవెంట్లో సాంకేతిక లోపం కారణంగా కార్యక్రమం నిలిచిపోయిన సమయంలో రాజమౌళి మాట్లాడుతూ, “నాకు దేవుడిపై నమ్మకం లేదు. నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ నన్ను ఓదార్చుతూ హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ ఈ సాంకేతిక లోపం వల్ల ఆగిపోయినప్పుడు ఇలానే నడిపించేది అని కోపం వచ్చింది” అని అన్నారు. ఆయన భార్య రామా హనుమంతుడిని ఎంతో ప్రేమిస్తారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు హిందూ సంఘాల ప్రతినిధులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేశాయి. రాష్ట్రీయ వానరసేన సభ్యులు రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ ఎవరూ చేయకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఇక “వారణాసి” అనే టైటిల్‌పై కూడా వివాదం నెలకొంది. ఈ టైటిల్ ఇప్పటికే తమకు రిజిస్టర్ అయిందని ఒక వ్యక్తి ఫిల్మ్ చాంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సినిమా టైటిల్ విషయంలో కూడా చట్టపరమైన చిక్కులు రాజమౌళిని వెంటాడుతున్నాయి.
వివాదం ఇంకా కొనసాగుతుండగా, ఈ ఘటనపై సినీ పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి.
