Rashmika Mandanna Opens Up About the Tough ‘Maisa’ Shoot: “I’m Not a Fish!”

D News: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక గిరిజన గోండు మహిళగా కనిపించనుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో ఆమెను డిఫరెంట్ లుక్‌లో చూపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రష్మిక షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించింది.

వాటర్‌ఫాల్ స్టంట్‌తో భయం

కేరళలోని ఓ భారీ వాటర్‌ఫాల్ వద్ద యాక్షన్ సీన్ చేసినట్లు రష్మిక తెలిపింది. ఎత్తులంటే తనకు భయమని, అంత ఎత్తు నుంచి కిందికి చూడటమే చాలా భయంగా అనిపించిందని చెప్పింది. అయినప్పటికీ దర్శకుడి విజన్ కోసం ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించింది.

8 గంటలు నీటిలోనే..

‘మైసా’లో అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని రష్మిక చెప్పింది. స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఈ సీన్ సులభంగానే ఉంటుందని తొలుత అనుకున్నానని, కానీ గంటల తరబడి నీటిలో ఉండాల్సి రావడంతో చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. ఒకరోజు దాదాపు 8 గంటల పాటు అండర్‌వాటర్ షూటింగ్ చేశానని వెల్లడిస్తూ.. “నేను ఫిష్ కాదుగా.. అన్ని గంటలు వాటర్‌లో ఉండటానికి” అంటూ సరదాగా కామెంట్ చేసింది.

మడ్ ఫైట్, గాయంతోనూ షూటింగ్

మడ్ ఫైట్ కూడా తనకు మరో పెద్ద ఛాలెంజ్‌గా మారిందని రష్మిక తెలిపింది. మట్టిలో యాక్షన్ చేయడంతో శరీరం మొత్తం బురదతో నిండిపోయేదని, ఆ తర్వాత నడవడం కూడా కష్టంగా అనిపించేదని చెప్పింది. అలాగే షూటింగ్ సమయంలో హిప్‌కు గాయం కావడంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించింది.

తన సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలని కోరుకుంటానని రష్మిక చెప్పింది. ‘మైసా’ దర్శకుడి విజన్ నచ్చడంతో ఎన్ని కష్టాలు ఎదురైనా సీన్ పూర్తి చేయడానికి సిద్ధపడ్డానని పేర్కొంది. నవంబర్ 27న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

By Avinash