Rakul Preet Singh Says ‘Proud to Be an Indian’, Shares Special Post About Ramayana

Rakul Preet Singh: నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రామాయణ గాథను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించడం తనకు మరిచిపోలేని అనుభూతినిచ్చిందని రకుల్ తెలిపారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. భారతీయ కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే వారి ప్రయత్నం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ఈ సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, రవిదూబే, కాజల్ అగర్వాల్‌తో పాటు చిత్ర నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ రకుల్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా శూర్పణఖ పాత్ర కోసం ప్రతిరోజూ సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి తన రూపాన్ని పూర్తిగా మార్చిన కాస్ట్యూమ్, మేకప్ బృందాలను ప్రశంసించారు.

‘ఇది నా కెరీర్‌లో చేసిన మరో సినిమా మాత్రమే కాదు. భారతీయురాలిగా జీవితాంతం గర్వంగా గుర్తుంచుకునే ప్రత్యేకమైన అనుభూతి’ అంటూ రకుల్ భావోద్వేగంగా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *