DET:NOV 18:
రజనీకాంత్ తలైవర్ 173 డైరెక్షన్ బాధ్యతలు ధనుష్‌కి?సుందర్.సి నిష్క్రమణతో ఊహాగానాలు:
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం తలైవర్ 173 ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. లోకనాయకుడు కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి మొదట దర్శకుడిగా సుందర్.సి పేరు ప్రకటించారు.అయితే,అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

సుందర్.సి నిష్క్రమణ వెనుక కారణాలు:

సుందర్.సి కొన్ని ఊహించని,తప్పనిసరి పరిస్థితుల కారణంగా తలైవర్ 173 నుంచి తప్పుకుంటున్నట్టు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.అయితే,ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం,ఆయన చెప్పిన కథ అది హారర్ జానర్ అని టాక్ రజనీకాంత్‌కు పూర్తి సంతృప్తి కలిగించకపోవడంతోనే ఈ మార్పు జరిగిందని చెబుతున్నారు.నిర్మాత కమల్ హాసన్ కూడా దీనిపై స్పందిస్తూ,తమ స్టార్ హీరో మెచ్చే కథ దొరికే వరకు దర్శకుడి కోసం అన్వేషణ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాదు,ఊహించని దాన్ని ఆశించండి అని చెప్పడం ఆసక్తిని మరింత పెంచింది.

ధనుష్ పేరు బలంగా వినిపిస్తోంది:

సుందర్.సి వైదొలగడంతో, తలైవర్ 173 కుర్చీ ఇప్పుడు ఖాళీ అయ్యింది.ఈ స్థానంలోకి పలువురు పెద్ద దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ స్టార్ నటుడు మంచి దర్శకుడిగా పేరున్న ధనుష్ పేరు బలంగా వినిపిస్తోంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేందుకు ధనుష్‌తో నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.పా పాండి,రాయన్,ఇడ్లీ కడై వంటి చిత్రాలతో ధనుష్ ఇప్పటికే దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్సాహం:

రజనీకాంత్‌కు మాజీ అల్లుడు అయిన ధనుష్, తలైవర్ 173 కి దర్శకత్వం వహిస్తే అది నిజంగా ఒక సంచలనం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.రజనీకాంత్ మాస్ ఇమేజ్‌ను,ధనుష్ సహజమైన కథాబలం ఉన్న శైలిని కలిపి ఒక వినూత్నమైన చిత్రాన్ని చూడొచ్చని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.ఈ క్రేజీ కాంబినేషన్ గనక నిజమైతే,అది తమిళ సినీ పరిశ్రమకు ఒక పెద్ద పండుగ అవుతుంది.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు:
ప్రస్తుతానికి,ధనుష్ దర్శకత్వం వహిస్తారనేది కేవలం సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానం మాత్రమే.దీనిపై నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లేదా చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.దీంతో,సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఈ మెగా ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.