
D News: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా డిసెంబర్ 3, 2026న థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. ఆ తేదీకి సినిమా రావడం లేదని నిర్మాత వై. రవిశంకర్ స్పష్టం చేశారు.
డిసెంబర్ 3న రావడం లేదు..
కొంతకాలంగా ‘ఫౌజీ’ రిలీజ్ వాయిదా పడనుందనే వార్తలు వినిపిస్తున్నా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానుల్లోనూ కొంత గందరగోళం నెలకొంది. అయితే నాని నటించిన ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత రవిశంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా మరికొంత ఆలస్యంగా థియేటర్లలోకి వస్తుందని తెలిపారు. అయితే కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో..
‘ఫౌజీ’ కోసం ఇంకాస్త సమయం తీసుకుంటున్నామని చెప్పిన రవిశంకర్.. ప్రభాస్‌ను ‘బాహుబలి’ తర్వాత చూడని స్థాయిలో ఈ సినిమాలో చూస్తారని పేర్కొన్నారు. సినిమా చాలా భారీ స్థాయిలో ఉండబోతోందని, ప్రేక్షకులు దీన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా రూపొందిస్తున్నామని చెప్పారు.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2027లో విడుదలయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు నిర్దిష్ట తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడాల్సిందే.
హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
