D Educt: Sept 18: హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ అండ్‌ సర్జరీ’ (BUMS) కోర్సుకు అనుమతి నిరాకరించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్‌ 17న ఒక ప్రకటనలో వెల్లడించింది.

మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డ్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (MARBISM) నుంచి ఈ కోర్సుకు అనుమతి లభించకపోవడంతో ప్రస్తుతానికి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియలో నిజామియా టిబ్బి కళాశాలలోని BUMS కోర్సుకు ఆప్షన్‌ ఇవ్వలేదని వర్సిటీ స్పష్టం చేసింది.

నిబంధనల ప్రకారం MARBISM నుంచి అనుమతి లభించిన తర్వాతే ఈ కళాశాలకు సంబంధించిన BUMS కోర్సును వెబ్‌ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కాళోజీ వర్సిటీ తెలిపింది. దీంతో ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు తదుపరి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది.