
D Spiritual: Jul 3: అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులు విశేష కానుకను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా నాదుర్గల్కు చెందిన పి. రవీందర్, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దేవస్థానానికి అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణంతో పాటు ఒక వెండి చెంబును అందజేశారు.
దాతలు సమర్పించిన వెండి నాగాభరణం, వెండి చెంబు కలిపి మొత్తం 416 గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపారు. ఈ కానుకలను ఆలయానికి భక్తిశ్రద్ధలతో సమర్పించినట్లు పేర్కొన్నారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఈ వెండి కానుకలను అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఉప ప్రధానార్చకులు బి. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునకు దాతలు అధికారికంగా అందజేశారు.
అనంతరం దేవస్థానం అధికారులు దాతలకు రశీదు అందజేసి, వేదాశీర్వచనం నిర్వహించారు. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించి సత్కరించారు.
