
D Educt: Sept 4: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ రెండేళ్ల డిగ్రీ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని సూచించింది.
సెప్టెంబరు 4న ఉదయం 11 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు.. గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సును పూర్తి చేసి ఉండాలి. అలాగే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఏడాదిన్నర ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసిన వారు ఈ ప్రవేశాలకు అనర్హులని పేర్కొంది.
ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి అభ్యర్థికి కనీసం 21 ఏళ్లు పూర్తై ఉండాలని.. గరిష్ఠ వయోపరిమితి లేదని నోటిఫికేషన్లో వెల్లడించింది. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. బ్యాంకు ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.2,500 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఆన్లైన్ దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9000780707, 8008250842 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. ప్రవేశ నిబంధనలకు సంబంధించి సందేహాలు ఉంటే 8978780501, 9391805245 నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫోన్ చేయవచ్చని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.
