D News : మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్‌ మీడియాలో చేసిన తాజా పోస్ట్‌ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ‘‘నిరీక్షణ ముగిసింది.. కాసేపట్లో బిగ్‌ అప్డేట్‌.. తెలంగాణ వేచి చూడాలి’’ అంటూ ఆమె పోస్టు చేశారు. దీంతో సురేఖ ఏ ప్రకటన చేయబోతున్నారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కీలక పోస్ట్‌

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుసటి రోజే ఈ పోస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆమె గతంలో స్పష్టం చేశారు.

పార్టీ మార్పుపై ఊహాగానాలు

తాజా పోస్టుతో కొండా సురేఖ పార్టీ మారే అవకాశం ఉందంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై సురేఖ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

బీజేపీ నుంచి ఆహ్వానం?

కొండా సురేఖ బీజేపీలో చేరేందుకు వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇప్పటికే వ్యాఖ్యానించారు. అయితే పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని వారు స్పష్టం చేశారు.

ఇంతకీ సురేఖ ఏం చెప్పబోతున్నారు?

సురేఖ తాజా పోస్టుతో ఆమె రాజకీయంగా తదుపరి అడుగు ఏమిటన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీలో చేరికపై ప్రకటన చేస్తారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ మరో కీలక నిర్ణయం వెల్లడిస్తారా? అన్నది ఆమె తదుపరి ప్రకటనతోనే స్పష్టమవుతుంది.