
DNews: Mar17: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల లభ్యత, సరఫరా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం గ్యాస్ సరఫరా సమస్యపై ఆర్టీజీఎస్ సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్‌జీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. త్వరలో మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి సమస్యలు లేవని సీఎం స్పష్టం చేశారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు గ్యాస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణమే అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అర్హులైన ప్రజలకు ఈ-కేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని, ఈ విషయంలో ఎలాంటి మళ్లింపులు ఉండకూడదని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్‌ల లభ్యత కూడా పెరిగేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలంలో ఉత్పత్తిని పెంచి, పంపిణీని మెరుగుపరచాలని ఆయన కోరారు. సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీలోని కేజీ బేసిన్‌కు పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎన్‌జీ, పీఎన్‌జీల వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి పెంచే అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
