
D News: హారర్ సినిమా అంటే దెయ్యాలు, ఆత్మలు, రక్తపాతం, భయంకరమైన బంగ్లాలు గుర్తొస్తాయి. కానీ వీటిలో ఏదీ లేకుండానే ప్రేక్షకుల్లో భయం పుట్టించవచ్చని నిరూపించిన సినిమా ‘గెట్ అవుట్’ (Get Out). 2017లో వచ్చిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఇండియాలో JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు IMDbలో 7.8 రేటింగ్ ఉంది.
దర్శకుడు జార్డన్ పీల్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. కేవలం $4.5 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు $259.9 మిలియన్లు వసూలు చేసింది. అంతేకాదు.. 90వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును కూడా గెలుచుకుంది.
కథ విషయానికి వస్తే.. క్రిస్ (డానియల్ కలుయా) తన గర్ల్‌ఫ్రెండ్ రోజ్ కుటుంబాన్ని కలవడానికి ఆమె స్వస్థలానికి వెళ్తాడు. మొదట్లో ఆమె కుటుంబం క్రిస్‌ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. కానీ అక్కడి వాతావరణం, కుటుంబ సభ్యుల ప్రవర్తన క్రమంగా అతడికి అనుమానాలు కలిగిస్తాయి.ఆ ఇంట్లో దాగి ఉన్న భయంకరమైన నిజం ఏమిటి? తనకు ఎదురవుతున్న వింత పరిణామాల వెనుక అసలు కారణాన్ని క్రిస్ ఎలా తెలుసుకున్నాడు? అనేదే సినిమా ప్రధాన కథ.
ఈ సినిమాలో సంప్రదాయ అర్థంలో భయపెట్టే దెయ్యాలు ఉండవు. హిప్నాసిస్, మానసిక నియంత్రణ, భయానకమైన రహస్యం చుట్టూ కథను నడిపిస్తూ దర్శకుడు ప్రేక్షకుల్లో టెన్షన్ పెంచుతాడు. పైకి సాధారణంగా కనిపించే మనుషుల వెనుక దాగి ఉన్న మరో కోణాన్ని జార్డన్ పీల్ చాలా ఆసక్తికరంగా చూపించారు.
క్రిస్ పాత్రలో డానియల్ కలుయా నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. థ్రిల్లింగ్ కథనం, ఊహించని మలుపులు, మానసిక భయాన్ని కలిగించే సన్నివేశాలతో ‘గెట్ అవుట్’ హారర్ జానర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉండటంతో సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి వీకెండ్ వాచ్ అవుతుంది.
