
DSports 27 Novన్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో, భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై తక్షణమే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. జట్టు ప్రదర్శనపై సమీక్ష ఉంటుంది కానీ, తొందరపాటు నిర్ణయాలు ఉండబోవని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడడంతో, స్వదేశంలో టెస్టుల్లో 25 ఏళ్ల తర్వాత వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఘోర పరాజయం తర్వాత గంభీర్ కోచింగ్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో గంభీర్ స్పందిస్తూ, “నా భవిష్యత్తును నిర్ణయించాల్సింది బీసీసీఐనే. భారత క్రికెట్ ముఖ్యం, నేను కాదు,” అని వ్యాఖ్యానించారు. దీంతో గంభీర్ రాజీనామా చేయబోతున్నారా అనే ఊహాగానాలకు తెర లేచింది.
దీనిపై స్పందించిన బీసీసీఐలోని ఒక సీనియర్ అధికారి, “బోర్డు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో కూడా వెంటనే ఎలాంటి నిర్ణయమూ ఉండదు. ఆయన కాంట్రాక్ట్ 2027 ప్రపంచకప్ వరకు ఉంది” అని స్పష్టం చేశారు.
ప్రస్తుత గెలుపోటములను పక్కనపెట్టి, బీసీసీఐ దీర్ఘకాలిక ప్రణాళికలకు కట్టుబడి ఉందని, గెలిచినా ఓడినా ఆ ప్రణాళికల ప్రకారమే ముందుకెళ్తామని బోర్డు కార్యదర్శి దేబజిత్ సైకియా గతంలోనే ప్రకటించారు.
