
D-News: తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ నుంచి అయోధ్య, వారణాసి, ఢిల్లీ, హరిద్వార్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
అయోధ్యకు వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లే రైలు సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు రైళ్లు మార్చుకోవడం లేదా ఇతర రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి నుంచి అయోధ్యకు కొత్త రైలు సర్వీసు నడిపే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది.
హరిద్వార్‌కు వారానికి రెండు సార్లు
హరిద్వార్ వెళ్లే ప్రయాణికుల కోసం కూడా కొత్త సర్వీసు ప్రతిపాదన ఉంది. సికింద్రాబాద్–హరిద్వార్ మధ్య నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా వారానికి రెండుసార్లు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడిపే అంశంపై కసరత్తు జరుగుతోంది.
ఈ సర్వీసును తెలంగాణ సంపర్క్ క్రాంతి పేరుతో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఉత్తర భారతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలకు తెలంగాణ నుంచి ప్రయాణం మరింత సులభం కానుంది.
అదే సమయంలో చర్లపల్లి–హరిద్వార్ మధ్య నిజామాబాద్, అకోలా మీదుగా వారానికి ఒకసారి రైలు నడిపే ప్రతిపాదన కూడా సిద్ధమైంది.
ఢిల్లీకి కొత్త వీక్లీ రైళ్లు
సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త వీక్లీ రైళ్లను నడిపించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు అదనపు రైలు సౌకర్యం అందించడమే దీని ఉద్దేశం.
తిరుపతి సర్వీసులపైనా మార్పులు
తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లను పొడిగించడం, సర్వీసుల సంఖ్య పెంచడం వంటి ప్రతిపాదనలపై కూడా రైల్వే శాఖ పరిశీలన చేస్తోంది.
వారానికి రెండుసార్లు నడుస్తున్న తిరుపతి–కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్ వరకు పొడిగించి, రెగ్యులర్ రైలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
అలాగే తిరుపతి–నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు పొడిగించే ప్రతిపాదన కూడా ఉంది.
కొత్త రైళ్లకు సంబంధించి ప్రతిపాదనలు తుది దశలో ఉన్నప్పటికీ.. రూట్లు, సమయాలు, ప్రారంభ తేదీలపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
