
D News: Sept 30: ఉద్యోగులు, పెన్షనర్లకు 100 శాతం క్యాష్‌లెస్ వైద్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల (పెన్షనర్ల) ఆరోగ్య భద్రతకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)లో సమూల మార్పులు తీసుకొచ్చి, నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా 100 శాతం ఉచిత నగదు రహిత వైద్య సేవలు (Complete Cashless Treatment) అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రతి నెలా 1వ తేదీన నిధుల జమ
మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లో ఎదురవుతున్న జాప్యానికి చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల నుంచి వసూలు చేసే నెలవారీ చందాతో పాటు ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఖాతాలో జమ చేసేలా ఇటీవల జీవో నంబర్ 131ను విడుదల చేసింది.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు
గతంలో ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు నిరాకరించేవి. మరోవైపు క్లెయిమ్‌ల దాఖలు, పరిష్కారంలో జాప్యం కారణంగా ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో లక్షలాది రూపాయలను సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చేది.
ఈ నేపథ్యంలో మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని పెంచడంతో పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా సీమ్‌లెస్ క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే ప్రతి ఉద్యోగికి ఏడాదికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాయి.
క్యాష్‌లెస్ విధానాన్ని బలోపేతం చేసే దిశగా
ఉద్యోగుల నెలవారీ కంట్రిబ్యూషన్‌లో స్వల్ప మార్పులు చేస్తూ, మెడికల్ రీయింబర్స్మెంట్ విధానానికి బదులుగా పూర్తిస్థాయి క్యాష్‌లెస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనివల్ల నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు నగదు చెల్లించకుండా వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలపై ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
