
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసి, ఈ నెల మూడో వారంలోనే నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఎస్ఈలు, ఈఈలు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొల్లం వాగు నుంచి టన్నెళ్ల ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు చేపట్టిన అప్రోచ్ ఛానెల్ క్లియరింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండు టన్నెళ్లలో ఇంకా మిగిలి ఉన్న 286 మీటర్ల లైనింగ్ పనులను మరో 10 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. టన్నెల్-2లో నిలిచిపోయిన టిబీఎం (TBM) యంత్రాన్ని బయటకు తీసే ప్రక్రియ కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు.
సుమారు 1,900 మెట్రిక్ టన్నుల బరువున్న టిబీఎం యంత్రంలో ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నుల భాగాన్ని వెలికితీశామని మంత్రి తెలిపారు. మిగిలిన 600 మెట్రిక్ టన్నుల భాగాన్ని కూడా మరో 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన నిమ్మల రామానాయుడు.. ఐదేళ్ల కాలంలో టిబీఎం యంత్రాన్ని బయటకు తీయలేకపోయారని ఆరోపించారు. ఒక్క చుక్క నీరు కూడా అందించకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.450 కోట్ల వ్యయంతో ఫీడర్ కెనాల్లో కేవలం ఆరు నెలల్లో 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు 11 కిలోమీటర్ల లైనింగ్ పనులను పూర్తి చేసిందని వివరించారు.
నిర్వాసితుల పునరావాసంపై కూడా మంత్రి పలు వివరాలను వెల్లడించారు. మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,560 కుటుంబాలకు రూ.318 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. ఈ వారం మరో 2,863 కుటుంబాలకు రూ.353 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని చెప్పారు.
ఇక మిగిలిన 1,898 నిర్వాసిత కుటుంబాలకు ఈ నెలాఖరులోగా రూ.210 కోట్ల పరిహారం అందించి ఆర్అండ్ఆర్ ప్రక్రియను పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
