
D Spiritual: Oct 1: TTD Updates: ప్రస్తుతం పెరటాసి మాసం మూడో వారం కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులను పాచికాలువ ఆలయం నుంచి బాట గంగమ్మ ఆలయం వద్ద ఉన్న శాశ్వత క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరం అల్పాహారం, నీరు, పాలు అందిస్తున్నారు. తిరుమల కొండలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు.
సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇవాళ, అలాగే అక్టోబర్ 5న సిఫార్సు లేఖల ద్వారా కల్పించే దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయం తెలియక అదనపు ఈవో కార్యాలయానికి వచ్చిన కొంతమంది భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతి కల్పించారు. అక్టోబర్ 5న సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే అక్టోబర్ 4న ఆదివారం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
రోజుకు అదనంగా 30 వేల మంది భక్తులు: ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే అదనంగా వస్తున్న దాదాపు 30 వేల మంది భక్తులు మరుసటి రోజు దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో అధిక రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీ అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు.
