
D NEWS: మక్తల్ పట్టణ శివారులో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇరిగేషన్ శాఖ నూతన భవనానికి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. కార్యాలయాలు, సిబ్బంది విధుల నిర్వహణకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆధునిక సౌకర్యాలతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవనం పూర్తయితే ఇరిగేషన్ శాఖ కార్యకలాపాలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
సంగంబండ లెఫ్ట్ కెనాల్ ఇరువైపులా రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్ రోడ్డు వరకు ఇరిగేషన్ శాఖకు దాదాపు 16 ఎకరాల స్థలం ఉందని మంత్రి తెలిపారు. ఈ స్థలంలో గోదాములు, ఇతర కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు పెద్ద మొత్తంలో గోదాముల అవసరం ఉందని వాకిటి శ్రీహరి తెలిపారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంకను కోరారు. మక్తల్‌లో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ స్థలాన్ని కేటాయించాలని కూడా సూచించారు.
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. సాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, ఇరిగేషన్ శాఖ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
