
D Spiritual: Aug 3: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయం శ్రీశైలం జలాశయ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి ఆలయ గోపురంతో పాటు వేపదారు శివలింగం కూడా జలమయమయ్యాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొనడం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పబడుతుంది.
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరగడంతో సంగమేశ్వర ఆలయం దాదాపు ఎనిమిది నెలల పాటు పూర్తిగా నీటిలోనే ఉంటుంది. అనంతరం వేసవి కాలంలో నీటిమట్టం తగ్గిన తర్వాత మాత్రమే ఆలయం తిరిగి బయటకు కనిపించి సుమారు నాలుగు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అరుదైన విశేషాన్ని చూసేందుకు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తుంటారు.
సంగమేశ్వర ఆలయానికి ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా విశేష ప్రాధాన్యత ఉంది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ధర్మరాజు ఇక్కడ లభించిన వేప చెట్టు కలపతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇక్కడి పరమశివుడు “వేపదారు సంగమేశ్వరుడు”గా భక్తుల పూజలను అందుకుంటున్నాడు.
ఏడు నదులు కలిసే పవిత్ర ‘సప్తనదీ సంగమం’ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాచీన దేవాలయం బాదామి చాళుక్యుల కాలం నాటి అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయం నీటిలో మునిగి ఉన్న సమయంలో కూడా ఈ క్షేత్ర మహిమను స్మరించుకుంటూ భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి నది ఒడ్డున నిలబడి స్వామివారిని దర్శించుకుని ప్రార్థనలు చేస్తుంటారు.
